మరికొద్ది గంటల్లో సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మన దేశంతోపాటు 27 దేశాల్లో ఈ పరీక్షలకు 39 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారు. దేశ రాజధాని దిల్లీలో 877 కేంద్రాల్లో 5.8 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు.
ఈరోజు ఉదయం 10.30కు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రైతుల దిల్లీ చలో ఆందోళన నేపథ్యంలో దేశ రాజధానిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నందున విద్యార్థులు ఇంటి నుంచి త్వరగా బయలుదేరి పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని సీబీఎస్‌ఈ సూచనలు జారీ చేసింది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోని, ఇతర దేశాల్లోని విద్యార్థులూ 10 గంటలలోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది. స్థానిక పరిస్థితులు, ట్రాఫిక్, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగా రావాలని పేర్కొంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈ విషయంలో అన్ని పాఠశాలలు సాయం చేయాలని పేర్కొంది.