ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతర మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు ఇప్పటికే భక్తులు పోటెత్తుతున్నారు. మరో వారం రోజుల్లో జాతర జరగనుండటంతో మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు బారులు తీరుతున్నారు. ఈ జాతరలో ముఖ్యమైన మండమెలిగే పండుగతో మహా జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతరకు వారం రోజుల ముందుగా జరిగే మండమెలిగే పండుగను ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. డోలు వాద్యాల నడుమ పూజారులు, గ్రామస్థులు దిష్టి తోరణాలను కట్టి గ్రామాన్నంతా అష్టదిగ్బంధనం చేశారు.
మండమెలిగే పండుగ అంటే ఏంటి..
పూర్వం ప్రస్తుతం ఉన్న గుళ్ల స్థానాల్లో గుడిసెలుండేవి. జాతర నిర్వహించే సమయానికి ఇవి పాతపడడంతో ఆదివాసీ పూజారులు అడవికి వెళ్లి మండలు, వాసాలు, గడ్డి తీసుకొచ్చి కొత్త గుళ్లు నిర్మించేవారు. దీన్నే మండమెలిగే పండుగంటారు. ఈ పండుగను ఆదివాసీ సంప్రదాయం ప్రకారం డోలు వాద్యాల నడుమ కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఆలయాన్ని శుద్ధి చేసి సమ్మక్క, సారలమ్మ తల్లులకు పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం దిష్టి తోరణాలను కట్టి మేడారాన్ని అష్టదిగ్బంధనం చేస్తారు. రాత్రి నుంచి తెల్లవారుజాము దాకా గద్దెల వద్ద జాగరణ కూడా చేస్తారు.