కరోనా మూడో వేవ్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటికే పలు చోట్ల వేల సంఖ్యలో చిన్నారులకు కోవిడ్ సోకుతుండగా తల్లిదండ్రులు వారిని హాస్పిటల్స్‌లో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. అయితే కోవిడ్ సోకిన చిన్నారుల్లో చాలా మందికి స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉంటాయని, చాలా మందిని హాస్పిటల్‌లో చేర్పించాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే చికిత్స అందిస్తే తగ్గుతుందని, కేవలం 2-3 శాతం మంది పిల్లలను మాత్రమే హాస్పిటల్‌లో చేర్పించాల్సిన అవసరం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే కోవిడ్ సోకిన పిల్లల్లో దగ్గు, జ్వరం, జలుబు సహజంగానే కనిపిస్తాయని చెబుతున్నారు. కానీ పిల్లలను హాస్పిటల్‌లో చేర్పించాల్సిన అవసరం వస్తుంది కనుక అందుకు అనుగుణంగా వైద్య సదుపాయాలను ఇప్పటి నుంచే సమకూర్చాలని సూచిస్తున్నారు. లేదంటే పరిస్థితి తీవ్రతరం అవుతుందని హెచ్చరిస్తున్నారు.
కాగా ఈ విషయంపై నీతి అయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ కోవిడ్ సోకిన చిన్నారుల్లో చాలా మందికి లక్షణాలు కనిపించవని అన్నారు. కొందరికి దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. అలాగే చాలా తక్కువ శాతం మందికి మాత్రమే హాస్పిటల్‌లో చికిత్స అవసరం అవుతుందని అన్నారు. అలా అని నిర్లక్ష్యం వహించరాదని, వైద్య సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని అన్నారు.
ఇక కోవిడ్ పాజిటివ్ లేదా నెగెటివ్ ఏది వచ్చినా చిన్నారులకు ఆర్‌టీపీసీఆర్ టెస్టు కూడా చేయించాలన్నారు. దీంతో మరింత కచ్చితమైన ఫలితం వస్తుందని అన్నారు. చిన్నారుల్లో ఊపిరితిత్తులకు న్యుమోనియా వచ్చే అవకాశం ఉందని, ఈ విషయంలో జాగ్రత్త వహించాలని అన్నారు.