కరోనా బారిన పడి కోలుకున్న వారు 6 నెలల తరువాతే టీకాలు వేయించుకోవాలని ఇప్పటి వరకు నిపుణులు సూచించిన విషయం విదితమే. అయితే ఆ గడువును 9 నెలలకు పొడిగించాలని నిపుణులు సూచించారు. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టీఏజీఐ) అనే ప్రభుత్వ పానెల్ కేంద్రానికి సూచనలు చేసింది.
కోవిడ్ నుంచి కోలుకున్న వారికి ఇప్పటి వరకు 6 నెలల గడువుతో టీకాలను ఇచ్చేవారు. అయితే ఆ గడువును 9 నెలలకు పెంచాల్సిందిగా సూచించారు. కాగా ఇటీవలే కోవిడ్ రెండో డోసు గడువును 6 నుంచి 12 వారాలకు పొడిగించగా, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఇక కోవిడ్ నుంచి కోలుకుని ఇతర కోవిడ్ రోగులకు ప్లాస్మాను దానం చేసిన వారు 3 నెలల వరకు టీకా కోసం ఆగాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా టీకాలకు కొరత ఏర్పడినందునే టీకాలను ఇచ్చేందుకు గడువును పెంచుతున్నారని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే టీకాలను ఎక్కువ విరామంతో ఇవ్వడం వల్ల మెరుగ్గా పనిచేస్తాయని, అందువల్లే డోసుల మధ్య సమయం పెంచుతున్నామని కేంద్రం చెబుతోంది. ఈ క్రమంలో టీకాలకు గడువును పొడిగిస్తుండడాన్ని పలువురు తప్పు బడుతున్నారు. టీకాలు లేనందునే కేంద్రం ఇలా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు.