నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటివరకు వర్షాల జాడ లేదు. కానీ బిపోర్జాయ్ తుపాను మాత్రం రాకముందే తెగ వణికించేస్తోంది. తాజాగా అతి తీవ్ర తుపానుగా మారిన బిపోర్జాయ్ కచ్ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే సహాయక చర్యలను వేగవంతం చేసింది.
ఇప్పటివరకు గుజరాత్లోని ఎనిమిది జిల్లాల్లో తీర ప్రాంతాల్లో నివసించే దాదాపు 37,794 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ముఖ్యంగా సముద్ర తీరానికి 10 కి.మీల లోపు నివసించే ప్రజలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
తుపాను తీవ్రత దృష్ట్యా దేవభూమి ద్వారక, రాజ్‌కోట్, జామ్‌నగర్, జునాగఢ్, పోర్‌బందర్, గిర్ సోమనాథ్, మోర్బి, వల్సాద్ జిల్లాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) 17 బృందాలు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) 12 బృందాలను సిద్ధంగా ఉంచామని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. సున్నిత ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి తగిన ఏర్పాట్లు చేయాలని విద్యుత్, టెలికమ్యూనికేషన్, ఆరోగ్య శాఖలను ఆదేశించింది.