దిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్నారు. అయితే జైలులో అధికారులు, బీజేపీ తనతో ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ కేజ్రీవాల్ దేశ ప్రజలను ఉద్దేశించి ఓ సందేశాన్ని పంపారు. ‘నేను అరవింద్ కేజ్రీవాల్‌ను..ఉగ్రవాదిని కాదు’ అంటూ ఆ లేఖ కొనసాగింది. ఆ లేఖను ఆప్ నేత సంజయ్ సింగ్ ఓ మీడియా సమావేశంలో చదివి వినిపించారు.
దుర్మార్గం, పగతో బీజేపీ కేజ్రీవాల్‌ను కుంగదీయాలని చూస్తోందని సంజయ్ సింగ్ మండిపడ్డారు .వీటన్నింటిని ఎదుర్కొని ఆయన గొప్ప శక్తిగా మారతారని అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కలిసేందుకు వెళ్లినప్పుడు కేజ్రీవాల్‌ను ఉగ్రవాది మాదిరిగా గాజుగోడ మధ్య నిలబెట్టారని మండిపడ్డారు. ఎన్నికల బాండ్లను సమర్థించిన ప్రధాని మోదీ సుప్రీం కోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా అవమానించారని మండిపడ్డారు. సుప్రీం కోర్టుకు, దేశ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.