Delhi High Court: 24 గంటల్లో ఆ ట్వీట్లను తొలగించండి..లేదంటే..?

-

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో నకిలీ లైసెన్సుతో బార్ నడుపుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేసిన ఆరోపణలపై శుక్రవారం దిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఆరోపణలు చేస్తూ వారు చేసిన ట్వీట్లను 24 గంటల్లో తొలగించాలని ఆదేశించింది. ఒకవేళ వారు ఆ ట్వీట్లను తొలగించకపోతే.. వాటిని సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్ తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

స్మృతి ఇరానీ కుటుంబంపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయని, మంత్రి కుమార్తె గోవాలో నడుపుతున్న రెస్టారెంట్‌లో నకిలీ లైసెన్సుతో బార్‌ నడుపుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేడా ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. హస్తం పార్టీ చేసిన ఆరోపణలను స్మృతి తీవ్రంగా ఖండించారు. అంతేగాకుండా న్యాయపరమైన చర్యలు చేపట్టారు. తన కుమార్తెపై చేసిన ఆరోపణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని.. ఈ క్రమంలోనే బేషరతుగా రాతపూర్వక క్షమాపణలు చెప్పాలంటూ పవన్ ఖేడా, జైరాం రమేశ్‌, నెట్టా డిసౌజాలతోపాటు కాంగ్రెస్‌ పార్టీకి లీగల్ నోటీసు పంపారు.

దీనిపై ఆ నేతలకు దిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేస్తూ.. ఆగస్టు 18న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నోటీసుల విషయాన్ని జైరాం రమేశ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘ఈ కేసులో సమాధానం ఇవ్వాలని దిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కోర్టు ముందు వాస్తవాలు ఉంచేందుకు ఎదురుచూస్తున్నాం’ అని రమేశ్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news