విశాఖ జిల్లా వాసవాణిపాలెం, పెద్ద జలారిపేట జాలర్ల మధ్య వివాదంపై ఏపీ మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు స్పందించారు. ప్రస్తుతం పరిస్థితులు పోలీసుల అదుపులోనే ఉన్నాయని వెల్లడించారు. ఇరు వర్గాలు గతంలో చర్చించుకుని రాజీకొచ్చినా.. మళ్లీ పరిస్థితి మొదటికొచ్చిందన్నారు. రెండు గ్రామాల ప్రజలను సమన్వయం కోల్పోవద్దని సూచించినట్లు తెలిపారు. ఇవాళ సాయంత్రం ఇరు వర్గాలకు చెందిన మత్స్యకారులతో సమావేశమవుతామని.. వారి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి అప్పలరాజు చెప్పారు.
అసలేం జరిగిందంటే.. విశాఖ జిల్లాలో వాసవాణిపాలెం,పెద్ద జలారిపేట మత్స్యకారులు మధ్య వివాదం రాజుకుంది. పెద్దజాలరిపేటకు చెందిన కొందరు తమపై మరణాయుధాలతో దాడి చేశారని వాసవాణిపాలెం మత్స్యకారులు ఆరోపించారు. ఆరు బోట్లకు నిప్పు పెట్టారని, వలలను సైతం దగ్ధమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు నెలలు క్రితం ఇదే తరహా వివాదం జరిగిందని… కలెక్టర్ కార్యాలయంలో చర్చలు జరిగాయని తెలిపారు. కానీ మళ్లీ రింగు వలలు, సాంప్రదాయ మత్స్యకారులు మధ్య మళ్లీ వివాదం మొదలైంది. ఆరు బోట్లకు నిప్పుపెట్టడంతో వాసవానిపాలెం గ్రామస్థులు నిరసనకు దిగారు. విశాఖ ఏసీపీ మూర్తి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపులోకి తెచ్చారు.