మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఓవైపు అధికార, మరోవైపు విపక్ష ఎంపీలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలనే మాట్లాడిన డీఎంకే నేత కనిమొళి.. కీలక వ్యాఖ్యలు చేశారు. నారీ శక్తి వందన్ అధినియం పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో వందనం అన్న పదాన్ని ఆమె తప్పుపట్టారు.
వందనం అంటే సెల్యూట్ అని, తమకు ఎవరూ సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదని, కానీ మహిళల్ని సమానంగా చూస్తే సరిపోతుందని కనిమొళి అన్నారు. బలమైన, శక్తివంతమైన మహిళను ఎందుకు దెయ్యంలా చూస్తారని ప్రశ్నించారు. భారతీయ చరిత్రలో ఎంతో మంది శక్తివంతమైన మహిళా నేతలు ఉన్నారని, ఆ జాబితాలో ఇందిరా గాంధీ, జయలలిత, సుష్మా స్వరాజ్ ఉన్నట్లు ఆమె చెప్పారు. అన్నాడీఎంకే నేత జయలలిత కూడా శక్తివంతమైన నేత అని కనిమొళి అనడంతో సభలో బీజేపీ సభ్యులు అరిచారు.
కేంద్ర ప్రభుత్వం రహస్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు తీసుకువచ్చినట్లు కనిమొళి ప్రశ్నించారు. మంత్రులతో ఎటువంటి సమావేశాలు నిర్వహించకుండానే.. అకస్మాత్తుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఎవరికీ చెప్పకుండా బిల్లును ప్రవేశపెట్టడంలో ఉన్న తొందర ఏంటని ఆమె ప్రశ్నించారు.