ద్వారకాపీఠ్ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూశారు. 99 ఏళ్ల వయసున్న ఆయన.. మధ్యప్రదేశ్ నార్సింగ్పుర్లోని పీఠంలో తుదిశ్వాస విడిచారు. స్వామి స్వరూపానంద సరస్వతి 1924 సెప్టెంబర్ 2న మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలోని దిఘోరీ గ్రామంలో జన్మించారు. తొమ్మిదేళ్లకే ఇంటి నుంచి వెళ్లిపోయిన స్వరూపానంద.. మతప్రచార యాత్రలు చేపట్టారు. ఆయన మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు.
స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వరూపానంద సరస్వతి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 19 ఏళ్లకే స్వాతంత్య్ర పోరాటంలో దూకిన విప్లవ సాధువుగా పేరు తెచ్చుకున్నారు. ఈ సమయంలో ఆయన తొమ్మిది నెలలు వారణాసి, ఆరు నెలలు మధ్యప్రదేశ్లోని ఓ జైలులో గడిపారు. 1950లో దండి సన్యాస దీక్ష చేపట్టిన ఆయన స్వామి స్వరూపానంద సరస్వతిగా ప్రసిద్ధి చెందారు. హిందువులను ఏకం చేయాలనే సంకల్పంతో ఆది గురు శంకరాచార్య దేశంలో నాలుగు మత రాజధానులను చేయగా.. ద్వారక పీఠానికి అధిపతిగా బాధ్యతలు చేపట్టారు స్వరూపానంద సరస్వతి.