భారత్​తో ‘రక్షణ’ బంధం బలోపేతంపై దృష్టి పెట్టాం: పెంటగాన్

-

గత కొంతకాలంగా అమెరికా-భారత్​ల మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి. ముఖ్యంగా మోదీ అమెరికా పర్యటన.. బైడెన్ జీ-20 సమావేశాల కోసం భారత్​లో పర్యటించిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన బంధం మరింత బలపడింది. అయితే ఈ క్రమంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది.

భారత్‌తో బలమైన రక్షణ బంధాన్ని పెంపొందించుకొంటామని మరోసారి అమెరికా రక్షణ శాఖ కార్యాలయమైన పెంటగాన్‌ వెల్లడించింది. రక్షణ రంగంలో భారత్‌తో అమెరికా బంధాన్ని భవిష్యత్తులో మరింత బలపర్చడంపై దృష్టిపెట్టామని పెంటగాన్‌ ప్రెస్‌ సెక్రటరీ పాట్‌ రైడర్‌ తెలిపారు. భవిష్యత్తులో ఈ రెండు దేశాలు కలిసి ఎలా ముందడుగు వేస్తాయో ప్రపంచం చూస్తుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు చైనాతో బంధంపైనా రైడర్ మాట్లాడారు. అమెరికా రక్షణ రంగానికి డ్రాగన్ దేశం ఓ సవాలుగానే నిలుస్తుందని వెల్లడించారు. కెనడా-భారత్‌ వివాదం ఇండో-అమెరికా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపించిందని జరుగుతున్న ప్రచారాన్ని అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. ‘అమెరికా, భారత ప్రభుత్వాల మధ్య, ప్రజల మధ్య భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి రాయబారి గార్సెట్టి తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news