జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన బస్సు.. ఎనిమిది మంది మృతి

వరుస ప్రమాదాలతో జమ్ము కశ్మీర్ ప్రజలు హడలిపోతున్నారు. ముఖ్యంగా జమ్ముకు వెకేషన్ కోసం వెళ్తున్న యాత్రికులు చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ ఎక్కువగా లోయలు ఉండటం వల్ల వాహనాలు తరచూ అదుపు తప్పి ఆ లోయల్లో పడిపోతున్నాయి. ఇప్పటికే ఇలాంటి ప్రమాదాల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. సరదాగా గడుపుదామని వెళ్లిన వారు.. వైష్ణోదేవి వంటి ఆలయాలకు వెళ్లిన భక్తులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. తాజాగా ఇలాంటి మరో దుర్ఘటనే చోటుచేసుకుంది జమ్ముకశ్మీర్​లో.

జమ్ము జిల్లాలో వంతనపై నుంచి వెళ్తుండగా ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రయాణికులంతా మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జమ్ము సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ చందన్ కోహ్లీ తెలిపారు. గాయపడిన వారిని జమ్ములోని జీఎంసీ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.