ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం పడుతోంది. తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న వానతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, గార్ల, బయ్యారం, కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.
మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కారేపల్లి, భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు మండలలో వాన పడుతోంది. మరోవైపు పెద్దపల్లిలో కురుస్తున్న వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిముద్దవుతోంది. ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షంతో పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది.
రోహిణి కార్తె కావడంతో ఎండ, వడగాల్పుల తీవ్రత ఉన్నప్పటికీ ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని, దీనివల్ల రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.