దిల్లీ డిక్లరేషన్‌ ద్వారా రష్యాను ఒంటరి చేయడాన్ని ధ్రువీకరించారు : ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌

-

జీ20 సదస్సులో పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు.. దిల్లీ డిక్లరేషన్​ గురించి మాట్లాడారు. జీ20లో న్యూదిల్లీ డిక్లరేషన్‌ ద్వారా రష్యాను ఒంటరి చేయడాన్ని ధ్రువీకరించారని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తప్పు పట్టిన మెక్రాన్.. శాంతి, ఐకమత్యం కోసం ప్రధాని మోదీ మాటలకు ధన్యవాదాలు చెప్పారు.

రష్యా ఇప్పటికీ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉందని.. జీ20 మొత్తం ఉక్రెయిన్‌లో శాంతికి కట్టుబడి ఉందని.. ఐరాస ఛార్టర్‌కు అనుగుణంగా నేను ఈ మాటలు నొక్కి చెబుతున్నానని మెక్రాన్ తెలిపారు. జీ20 డిక్లరేషన్‌ రష్యాకు దౌత్య విజయం ఏమాత్రం కాదని ఆయన ఘాటుగా చెప్పారు. అసలు జీ20 ఉక్రెయిన్‌పై దౌత్యపరమైన పురోగతి సాధించడానికి వేదిక కాదని మెక్రాన్‌ వెల్లడించారు.

జీ20 సదస్సులో పర్యావరణంపై జరిగిన చర్చ సరిపోదని.. పర్యావరణ మార్పులపై స్పందించాల్సిన బాధ్యత సంపన్న దేశాలదే అన్నట్లు చూస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాల దృక్కోణం కూడా సరికాదని మెక్రాన్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధితో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం సమష్టిగా ఎదుర్కోవాల్సిన సమస్య ఇది అని పేర్కొన్నారు. భారత్‌, ఫ్రాన్స్‌ రక్షణ బంధం బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news