హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

-

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో పెను విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది దుర్మణం చెందారు. బాబా పాద ధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ విషాదం తర్వాత భోలే బాబా ఆచూకీ తెలియరావట్లేదు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరోవైపు హాథ్రస్‌ తొక్కిసలాట అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జితో విచారణ జరిపించాలని న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. ఐదుగురు నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని అందులో పేర్కొన్నారు. ఘటనపై యూపీ ప్రభుత్వం నివేదించేలా ఆదేశించాలని కోరారు. తొక్కిసలాట ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. తొక్కిసలాట తర్వాత ఘటన జరిగిన క్యాంపస్‌లో భోలే బాబా కన్పించలేదని.. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారన్నది ఇంకా తెలియరాలేదని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి సత్సంగ్‌ నిర్వాహకులు ముఖ్య సేవాదార్‌ దేవ్‌ప్రకాశ్‌ మధుకర్‌, ఇతర ఆర్గనైజర్ల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు చెప్పారు. బాబా పేరును ఇందులో పేర్కొనలేదని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news