అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షం కారణంగా వరదలు ముంచెత్తాయి. మేఘాలకు చిల్లు పడినట్టుగా కుండపోతగా కురిసింది వర్షం. దీంతో అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో పలు ఇళ్లు, వాహనాలు ధ్వసం అయ్యాయి. ఆదివారం ఒక్కసారిగా మేఘాల్లో పేలుడు సంభవించినట్టయింది. పరిసర ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. గత కొద్ది వారాలుగా ఈశాన్య రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
గత రెండు రోజులుగా పరిస్థితి మెరుగుపడింది. ఆదివారం వర్షం కురిసే అవకాశం లేదని అధికారులు తెలిపారు. కానీ అందుకు భిన్నంగా భారీ వర్షం కురిసింది. దీంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే NH-415పై వరద ప్రభావం కనిపించిందని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. వరద కారణంగా హైవేపై అనేక వాహనాలు నిలిచిపోయాయి. చాలా ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే ఇటానగర్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు మార్గదర్శకాలను జారీ చేసింది. నదులు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లవద్దని కోరింది. భారీ వర్షాల దృష్ట్యా వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేసింది. జిల్లా యంత్రాంగం ఏడు ప్రదేశాలను సహాయక శిబిరాలుగా ఏర్పాటు చేసింది. ఇటానగర్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం దగ్గర అత్యవసర సంప్రదింపు నంబర్ విడుదల చేసింది.