మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. తిరుగుబాటు చేసిన శివసేన మంత్రి షిండే బృందం నుంచి ఒక ఎమ్మెల్యే బయటపడ్డారు. తనని కిడ్నాప్ చేశారని, బలవంతంగా గుజరాత్లోని సూరత్ కు తీసుకువెళ్లారని శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ ఆరోపించారు. షిండే తన సహచరుడు, సీనియర్ మంత్రి అని అందుకే ఆయన వెంట వెళ్లానని తెలిపారు.
అయితే సూరత్ లోని హోటల్ కు వెళ్ళిన తర్వాత పార్టీలో తిరుగుబాటు గురించి తెలిసి తాను అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెప్పారు. అక్కడి నుంచి తప్పించుకుని బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు రోడ్డుపై ఉండగా కొందరు వ్యక్తులు వచ్చి తనను బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు అని ఆరోపించారు. అనంతరం అక్కడి నుండి బయటపడి నాగపూర్ కు చేరుకున్నట్లు ఆ ఎమ్మెల్యే వెల్లడించారు. తాను శివ సైనికుడినని, ఉద్ధవ్ ఠాక్రే కు నమ్మకంగా ఉంటానని అన్నారు. కుట్రతోనే తనను సూరత్ కు తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు.