రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు భేటీ అయి పలు కీలక అంశాలు చర్చించిన ఇండియా కూటమి ఇప్పుడు మూడో సారి భేటీకి సిద్ధం అవుతోంది. ఆగస్టు 31న మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఈ సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో.. ఇండియా కూటమి లోగో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సీట్ల పంపకాలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సృష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని పార్టీలు కూడా కూటమిలో చేరతాయని తెలుస్తోంది. ప్రస్తుతం 26 పార్టీలతో ఉన్న ఇండియా కూటమిలో.. ఈశాన్య రాష్టాలకు చెందిన కొన్ని ప్రాంతీయ పార్టీలు చేరొచ్చని సమాచారం.
ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్లో రెండు రోజుల పాటు ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశం జరగనుంది. శివసేన(యూబీటీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్‌లతో కూడిన మహా వికాస్ అఘాడి అధ్వర్యంలో ఇండియా కూటమి మూడో సమావేశం జరగనుంది.