హైదరాబాద్ నగరంలో ఇటీవలే ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ బాధితుల కేసులు సంచలనం సృష్టించిన విషయం విదితమే. అందులో భాగంగానే సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు కంపెనీలకు చెందిన నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. వారు లోన్ యాప్‌లను సృష్టించి పెద్ద ఎత్తున ప్రజలకు ఇన్‌స్టంట్ రుణాలను ఇస్తూ చెల్లించని వారిని తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే అలాంటా అనేక యాప్స్‌ను గూగుల్ బ్యాన్ చేసింది. వాటిని తన ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించింది. కానీ ఇంకా అలాంటి యాప్స్ అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో ప్రస్తుతం ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుండడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు. అక్కడ ప్రస్తుతం ఇలాంటి బాధితుల సంఖ్య పెరుగుతుందని పోలీసులు తెలిపారు. బాధితులు బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారని, దీంతో తాము యాప్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నామని బెంగళూరుకు చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు.
కాగా బెంగళూరులో డిసెంబర్ నెల నుంచి ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ బాధితుల సంఖ్య పెరిగింది. కొందరు ఫిర్యాదు చేస్తున్నారు కానీ కొందరు చేయడం లేదని పోలీసులు తెలిపారు. బాధితులెవరైనా సరే ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాధారణంగా బ్యాంకులు ఏడాదికి 14 శాతం వరకు వ్యక్తిగత రుణాలపై వడ్డీని వసూలు చేస్తాయి. కానీ ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ నిర్వాహకులు రోజుకు 10 శాతం చొప్పున వడ్డీని వసూలు చేస్తున్నారని, అలాగే ఆర్‌బీఐ నుంచి అనమతి లేకుండానే కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని, రుణాలను చెల్లించని వారికి గడువు తేదీ ముగిశాక 3 రోజుల వరకు సమయం ఇస్తున్నారని, ఆ సమయం కూడా దాటితే రోజులు గడిచే కొద్దీ భారీ ఎత్తున జరిమానాలు వేసి రుణాలను బలవంతంగా వసూలు చేస్తున్నారని అన్నారు. అదే మహిళలు రుణం తీసుకుంటే వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల సైట్లలో వాటిని అప్‌లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. కనుక ఇన్‌స్టంట్ లోన్ యాప్‌ల జోలికి వెళ్లకూడదని బెంగళూరు పోలీసులు హెచ్చరిస్తున్నారు.