టీఎస్‌ ఆర్టీసీలో జీతాల పెంపు మళ్లీ రాజకీయం అవుతుందా ?

-

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగుల జీతాల పెంపుపై కొంత కాలంగా వివాదం నలుగుతోంది. అప్పట్లో వేతన సవరణ డిమాండ్‌పై సుదీర్ఘంగా సమ్మె చేశారు కార్మికులు. చివరకు ఆ సమ్మె నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. ఇప్పుడు ఉద్యోగుల పీఆర్సీ అంశం తెరమీదకు రావడంతో ఆర్టీసీలో వేతనాలపై కూడా కొత్త చర్చ మొదలైంది. కలెక్టర్ కంటే ఆర్టీసీలో జీతాలు ఓ రేంజ్ లో ఉన్నాయని సీఎంకి ఇచ్చిన నివేదిక ఇప్పుడు కొత్త నిప్పు రాజేసింది.

ప్రభుత్వానికి అందజేసినట్టుగా చెబుతున్న నివేదికలోని అంశాలపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. సొంత లాభం చూసుకున్న అధికారులు.. చిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని ఫైర్‌ అవుతున్నారు కార్మికులు. కార్మికుల జీతాల పెంపు అంశం ఎప్పుడు చర్చకు వచ్చినా.. సంస్థ నష్టాలను ప్రస్తావిస్తారు. దీనిపైనా ఉద్యోగులు అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. కలెక్టర్‌ కంటే ఎక్కువగా జీతాలు తీసుకుంటూ కొందరు అధికారులు డ్రైవర్‌, కండెక్టర్‌, ఇతర చిన్న ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.

ఇటీవల సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఆర్టీసీ ఉన్నతాధికారులు కార్మికుల వేతనాలు పెంచితే ఛార్జీలు పెంచక తప్పదని చెప్పారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి రుసరుసలాడుతున్నారు కార్మికులు. ఆర్టీసీలో ఐదుగురు ఈడీలు ఉన్నారు. ఒక్కొక్క ఈడీకి కనీసంగా నెల వేతనం రెండున్నర లక్షలుగా ఉంది. ఆ స్థాయి నుంచి మొదలుపెడితే.. డీఎంల వరకు భారీగానే జీతాలు పొందుతున్నారు.

డ్రైవర్లు, కండెక్టర్లు దగ్గరకు వచ్చేసరికి బేసిక్‌ చాలా తక్కువ ఉందన్నది కార్మికులు చెప్పేమాట. ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ బేసిక్ పే ఇరవై వేలు కాగా టీఎస్ ఆర్టీసీలో 18 వేలుగా ఉంది. ఇదే తరహాలో కండక్టర్ బేసిక్ పే ఏపీఎస్ ఆర్టీసీలో 19వేలు ఉంటే టీఎస్ ఆర్‌టీసీలో 12వేలుగా ఉంది.అదే సింగరేణి సంస్థలో డ్రైవర్ బేసిక్ పే 30 వేలు, ప్రభుత్వ శాఖల్లో డ్రైవర్ బేసిక్ పే 20 వేలరూపాయలు ఉంది. ఇలాంటి లెక్కలన్నీ బయటకు తీస్తున్నారు కార్మికులు.

ప్రస్తుతం కార్మిక సంఘాలు లేకపోవడంతో ఇలాంటి వాటిని ప్రశ్నించేవారు సంస్థలో కరువైనట్టు ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. టీఎస్‌ ఆర్టీసీలో జీతాల పెంపు వివాదం మళ్లీ రాజకీయకాక పుట్టించేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news