నేడు ఇస్రో చరిత్రాత్మక ప్రయోగం..నింగిలోకి పది ఉప గ్రహాలు…!

శ్రీహరి కోట నుంచి ఇవాళ PSLV C-49 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. దీని ద్వారా పది ఉపగ్రహాలను కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది ఇస్రో.ఈ ఏడాది తొలి రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడ్డ ప్రయోగాలను తిరిగి ప్రారంభించబోతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు PSLV C-49 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

నిన్న మధ్యాహ్నమే ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. PSLV C-49 రాకెట్‌ ద్వారా నింగిలోకి పది ఉపగ్రహాలను పంపనున్నారు. ఈఓఎస్‌-01 అనే ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌తో పాటు మరో 9 విదేశీ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించనుంది. వ్యవసాయం, అటవీ రంగాలతో పాటు ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు సరికొత్తగా ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ను రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. తొలుత ఈ ప్రయోగాన్ని మార్చి 12న నిర్వహించాలని అనుకున్నారు. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది.

ఇవాళ ప్రయోగం పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. PSLV సిరీస్‌లో ఇది 51వ ప్రయోగం కాగా, షార్‌ నుంచి 76వ ప్రయోగం. ఇప్పటికే శ్రీహరికోట ప్రయోగ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో శాస్త్రవేత్తలు మినహా మిగతా ఎవ్వరినీ ఇస్రో షార్‌లోకి అనుమతించడం లేదు. రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రజలకు కూడా అనుమతి లేదని ఇస్రో తెలిపింది.