దిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టయిన గౌతమ్ మల్హోత్రాకు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో నగదు అక్రమ చలామణి వ్యతిరేక చట్టం కింద గౌతమ్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఒయాసిస్ గ్రూప్ ప్రమోటర్, మద్యం వ్యాపారి అయిన గౌతమ్ మల్హోత్రాను ఈ నెల 8న ఈడీ అరెస్టు చేయగా.. కోర్టు వారం రోజుల కస్టడీకి ఇచ్చిన విషయం విదితమే.
ఈడీ కస్టడీ ముగియడంతో ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ ఎదుట బుధవారం మల్హోత్రాను ఈడీ అధికారులు హాజరుపరిచారు. సిండికేట్ల ఏర్పాటులో మల్హోత్రా కీలకంగా వ్యవహరించారని ఈడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, రూ.వంద కోట్ల ముడుపుల వ్యవహారం, సౌత్ గ్రూప్ పాత్ర తదితర అంశాలపై మరింత సమాచారం సేకరించేందుకు ఆయనను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. అందుకు సమ్మతించిన ప్రత్యేక జడ్జి.. గౌతమ్ మల్హోత్రాను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. కేసు తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేశారు.