ఆర్థిక మంత్రిపై గవర్నర్ ఫైర్.. కేబినెట్ నుంచి తప్పించాలని సీఎంకు లేఖ

-

కేరళలో గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి నడుస్తోంది. తాజాగా సర్కార్ లోని ఓ మంత్రిని కేబినెట్ నుంచి తప్పించాలని కోరుతూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు లేఖ రాశారు. ఆర్థిక మంత్రి కేఎన్​ బాలగోపాల్​పై తాను విశ్వాసం కోల్పోయినట్లు లేఖలో పేర్కొన్నారు.

అక్టోబర్ 19న తిరువనంతపురంలోని ఓ యూనివర్సిటీ క్యాంపస్​లో బాలగోపాల్ ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు దేశ ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. అందువల్ల, బాలగోపాల్​పై విశ్వాసం కోల్పోయానని ప్రకటించడం మినహా తనకు వేరే అవకాశం లేకుండా పోయిందని గవర్నర్ తన లేఖలో వ్యాఖ్యానించారు.

కేరళలోని విజయన్ ప్రభుత్వానికి, గవర్నర్​కు మధ్య కొంతకాలంగా వేర్వేరు అంశాలపై వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవల విశ్వవిద్యాలయాల ఉపకులపతుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. తొమ్మిది యూనివర్సిటీల వీసీలను రాజీనామా చేయాలని గవర్నర్​ ఆదేశాలు జారీ చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. గవర్నర్​కు అలా ఆదేశించే అధికారాలు లేవని సీఎం ఎదురుదాడికి దిగారు. మరోవైపు.. గవర్నర్​ ఆదేశాల్ని సవాలు చేస్తూ వీసీలు న్యాయపోరాటం మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news