కేరళ గవర్నర్-ముఖ్యమంత్రి మధ్య ఇంకా చాలా కాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సీఎం పినరయి విజయన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి విజయన్ తనపై భౌతిక దాడి చేయించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. దిల్లీ పయనమయ్యేందుకు తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్తుండగా తన వాహనంపై కొందరు ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు దాడి చేశారని ఆరిఫ్ అన్నారు. ఇది ముఖ్యమంత్రి చేయించిన పనేనని, భౌతికంగా తనపై దాడి చేయించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలిపోతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
గవర్నర్, సీఎం మధ్య చాలా కాలంగా వివాదం ఉన్నా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దూరం మరింత పెరిగింది. ఇటీవల గవర్నర్ ఆరిఫ్ తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ సీఎం విజయన్ ఆరోపించారు. గవర్నర్‌గా ఆయన తన విధులు నిర్వర్తిస్తే చాలని.. గవర్నర్ ఏదైనా చెప్పాలి అనుకుంటే నేరుగా తనకు చెప్పాలని, మీడియాతో కాదని అన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తాజా ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి