బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాల్లో చిక్కుకొని కేసుల నుంచి బయటపడేందుకు తంటాలు పడుతుందన్నారు. ప్రజల్లో నానాటికి పలచనవుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారిపై పెట్టిన కేసులను అక్రమ కేసులు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంస పాలన చూసామని.. రెండు పార్టీలు తెలంగాణను దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పని చేశాయని రుజువు అయిందన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలన సాగిందన్నారు. రెండు పార్టీలు తెలంగాణ అభివృద్ధి లో విఫలమై పరస్పరం విమర్శలతో తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో చిన్న చిన్న రోడ్డు మరమ్మతు పనుల కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు. ఎక్సైజ్ శాఖ బిల్లులు మళ్లింపుతో చివరికీ బీర్లు సరఫరా చేయలేని దుస్థితి నెలకొందన్నారు.