లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా రాజీనామా చేశారు. 17వ లోక్‌సభకు ఆయన స్పీకర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇవాళ 18వ లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో కొద్దిసేపటి క్రితం ఆయన రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం… స్పీకర్ కార్యాలయాన్ని ఖాళీ చేసినట్లు లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 26వ తేదీన (బుధవారం రోజున) లోకసభ స్పీకర్ ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్పీకర్ ఎన్నికకు లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపు (జూన్ 25వ తేదీ) మధ్యాహ్నం 12గంటల లోపు స్పీకర్ పదవికి నామినేషన్ల దాఖలుకు గడువు విధించింది.
మరోవైపు లోక్‌సభ సమావేశాల్లో భాగంగా తొలిరోజైన నేడు పలువురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన వారు రేపు ప్రమాణం చేయనున్నారు. ఇక 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. వాయిదా తర్వాత వర్షాకాల సమావేశాల నిమిత్తం జులై 22వ తేదీన పార్లమెంటు మళ్లీ సమావేశమైనప్పుడు కేంద్ర బడ్జెట్ సమర్పించే అవకాశం ఉంది.