ఈ దొంగ రూటే వేరు.. యూట్యూబ్ లో చూసి దొంగతనం చేశాడు

ఈ మధ్య అక్రమార్కులు కూడా టెక్నాలజీని తెగ వినియోగిస్తున్నారు. హ్యాకింగ్ నుంచి దొంగతల వరకు, హత్యల నుంచి ఆత్మహత్యల వరకు యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే మహారాష్ట్ర పాల్ఘర్ లో జరిగింది. యూట్యూబ్ వీడియో చూసి ఓ ఇంటిని దోచుకున్నాడు. తరువాత పోలీసులకు చిక్కాడు. ఇంతకు ముందు ఎలాంటి నేర చరిత్ర లేని నిందితుడు యూట్యూబ్ లో వీడియో ద్వారా ఇంటిలో దొంగతనం చేశాడని పోలీసులు వెల్లడించారు. 

వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 38 ఏళ్ల వ్యక్తి దొంగతనం ఎలా చేయాలని యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాడు. వెంటనే దాన్ని అమలు కూడా చేశాడు. పాల్ఘర్ లోని ఓ ఇంట్లోకి చొరబడి రూ. 9.75 లక్షల నగదు, నగలను అపహరించాడు. నిందితుడు దిల్షన్ ఫయాజ్ షేక్ జూన్ 5న ఈ దొంగ తనానికి పాల్పడ్డాడు. అయితే సీసీటీవీ ఫులేజ్, ఇంటెలిజెన్స్ ఇన్ పుట్స్ సహా పలువురు చెప్పిన వివరాల ఆధారంగా గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ కు వెళ్లిన పోలీస్ టీములు నిందితున్ని యూపీలో పట్టుకున్నాయి. నిందితుడు యూట్యూబ్ లో చూసి దొంగతనం చేశానని చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు.