గుజరాత్ కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
‘‘మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఘటనపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. ఐదు రోజుల క్రితమే సందర్శన కోసం ఈ బ్రిడ్జిని తెరిచారు.. అంతలోనే అంతమందిని అక్కడికి ఎవరు అనుమతించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. గహ్లోత్ కూడా అక్కడే ఉన్నారు. వీలైనంత సాయం చేసేందుకు ప్రయత్నిస్తాం. ఈ ఘటనపై ఎలాంటి రాజకీయం చేయదల్చుకోలేదు. ఎవరినీ నిందించం. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడే దీనిపై స్పందిస్తాం.’’ అని మల్లికార్జున ఖర్గే తెలిపారు.
గుజరాత్ మోర్బీ ప్రాంతంలోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్ప కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 141 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు.