ఈశాన్య రాష్ట్రం మణిపుర్ మరోసారి రావణకాష్టంలా రగిలింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో మొత్తం 40 మందిని మిలిటెంట్లను హతమార్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం ఆరు చోట్ల దళాలకు, తిరుగుబాటుదారులకు మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనలో ఇద్దరు పౌరులు కూడా మృతి చెందినట్లు అధికారులు వివరించారు. మరో 12 మంది గాయపడ్డారు.
చాలామంది తిరుగుబాటుదారులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మణిపుర్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సాయుధ ఉగ్రవాదులకు.. కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పోరాటం జరుగుతోందని వెల్లడించారు.
“సాధారణ పౌరులపై ఎమ్-16, ఏకే-47, స్నైపర్ గన్లతో తిరుగుబాటుదారులు దాడికి దిగుతున్నారు. గ్రామాల్లోకి ప్రవేశించి ఇళ్లకు సైతం నిప్పు పెడుతున్నారు. దీనిపై వెంటనే అప్రమత్తమయ్యాం. దీంతో ఇండియన్ ఆర్మీ, ఇతర భద్రతా బలగాల సాయంతో తిరుగుబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 40 మంది తిరుగుబాటుదారులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.” అని ఆ రాష్ట్ర సీఎం ఎన్. బీరేన్ సింగ్ తెలిపారు.