దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాకు ఇప్పట్లో బెయిల్ లభించేలా లేదు. ఈ కేసులో సిసోదియా బెయిల్ పిటిషన్ పై ఇవాళ దిల్లీ కోర్టు విచారణ జరిపింది. సిసోదియా విచారణకు సహకరిస్తున్నారని.. ఆయనకు కస్టోడియల్ విచారణ అవసరం లేదని మనీశ్ సిసోదియా తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
‘‘ఈ కేసులో సిసోదియా ముడుపులు తీసుకున్నట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవు. సోదాల్లోనూ ఆయనకు వ్యతిరేకంగా ఏమీ లభించలేదు. ఆయన విచారణకు సహకరిస్తున్నారు. విదేశాలకు పారిపోయే ముప్పు లేదు కాబట్టి ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి అవసరం లేదు. ఇక ఆయన సతీమణి అనారోగ్యంతో బాధపడుతున్నారు. సిసోదియా కొడుకు విదేశాల్లో చదువుతున్నాడు. అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకోవాల్సిన బాధ్యత సిసోదియాపై ఉంది’’ అని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.
అయితే ఈ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. ‘‘ఆయన విదేశాలకు పారిపోకపోవచ్చు. కానీ, ఈ కేసులో ఆయన సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రమాదముంది. నిరంతరం ఫోన్లు మార్చిన ఓ వ్యక్తి అమాయకుడు మాత్రం కాదు. ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు 60 రోజుల గడువు ఉంది. ఇప్పుడు సిసోదియా బయటకు వస్తే దర్యాప్తు పక్కదారి పడుతుంది.’ అని సీబీఐ వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను మార్చి 24వ తేదీకి వాయిదా వేసింది.