దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా కొన్ని నెలల క్రితం అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైల్లో ఉన్న సిసోదియాను ఆయన భార్య దాదాపు మూడు నెలల తర్వాత కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
‘‘రాజకీయ క్రీడలో జైలుపాలైన నా భర్తను 103 రోజుల విరామం తర్వాత కలిశా. ఇన్నాళ్లూ నేల మీదే పడక, ఈగలూ దోమల బాధలు, విపరీతమైన వేడి బాధ మరోవైపు.. అయినా మనీశ్ కళ్లలో తన ఆశయ సాధనకు అదే నిశ్చలత్వం చూశా’’ అని సిసోదియా భార్య సీమా భావోద్వేగానికి గురయ్యారు. లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న మనీశ్ గత మూణ్నెల్లకు పైగా తిహాడ్ జైలులో బందీగా ఉన్న విషయం తెలిసిందే. బెయిలు ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో.. అనారోగ్యంతో ఉన్న భార్య సీమాను, ఇతర కుటుంబ సభ్యులను వారి ఇంట్లో కలిసేందుకు దిల్లీ హైకోర్టు గత వారం మనీశ్‌ను అనుమతించింది.