అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 2009లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వారు ఆ యూనివర్సిటీకి మికోయన్-గురెవిచ్ (మిగ్)-23బీఎన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. దాన్ని క్యాంపస్‌లో విద్యార్థుల పరిశోధనలకు ఇచ్చారు. అయితే ప్రస్తుతం దాన్ని కొందరు ప్రబుద్ధులు OLXలో రూ.10 కోట్ల ధరకు అమ్మకానికి పెట్టారు. దీంతో ఈ విషయం కలకలం రేపుతోంది.
అయితే దీనిపై యూనివర్సిటీ ప్రొక్టార్ ప్రొఫెసర్ మహమ్మద్ వసీం అలీ స్పందిస్తూ.. తమ యూనివర్సిటీకి చెందిన ఎవరూ ఆ విమానాన్ని OLXలో పెట్టలేదని, ఇది ఎవరో ఆకతాయిలు చేసిన చర్య అని అన్నారు. అయితే యూనివర్సిటీకి చెందిన ఎవరో ఈ పని చేసి ఉంటారని తెలుస్తోంది. ఈ విషయంపై తాము విచారణ చేపట్టామని, ఈ పని ఎవరు చేశారో తెలుసుకుంటామని వసీం అలీ తెలిపారు. సదరు విమానం ఫొటోను OLX నుంచి తీసేశామని తెలిపారు.
కాగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థుల స్టడీ కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వారు గతంలో సదరు మిగ్-23 విమానాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే అలాంటి విమానాలను దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలకు గిఫ్టులుగా ఇచ్చింది. అయితే ఈ యూనివర్సిటీలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడం షాకింగ్‌గా మారింది. ఇక ఈ మిగ్ 23 విమానాలను రష్యా 1970లలో తయారు చేసింది. వీటిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 1981 జనరి 24 నుంచి ఉపయోగిస్తోంది. వీటిల్లో అధునాత జెట్లు రావడంతో మార్చి 6, 2009 నుంచి వీటిని ఉపయోగించడం మానేశారు. అలాంటి కొన్ని విమానాలనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆయా యూనివర్సిటీలకు గిఫ్టులుగా అందజేసింది.