ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ నెల 13న మోదీ రావాల్సి ఉండగా మోదీ ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. మరోవైపు ఈ నెలలో రాష్ట్రానికి ఇద్దరు బీజేపీ అగ్రనేతల పర్యటన ఖరారైంది.
ఈ నెల 11న అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి లేదా మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో ఆయన పాల్గొంటారు. ఇందులో భాగంంగానే ఒక శక్తి కేంద్రంతో అమిత్ షా సమావేశమవుతారు. ఈ నెలాఖరున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రానున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జాతీయ నేతలు తెలంగాణలో పదేపదే పర్యటిస్తుండడం.. చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు వేసి సమావేశాలు నిర్వహించి.. జాతీయ నేతలు పాల్గొనేలా ప్రణాళికలు సిద్దం చేస్తుంది.