ఓవైపు వణికించే మహమ్మారి.. అనుకోని విపత్తు విరుచుకుపడినంతనే జీతాల్లో కోతలు పెట్టే కంపెనీలు కొన్ని.. కొందరు ఉద్యోగులకు చెల్లుచీటి ఇచ్చే సంస్థలు మరికొన్ని.. ఉద్యోగుల సంగతి ఇలా ఉంటే.. వ్యాపారుల పరిస్థితి మరింత దారుణం!! ప్రశాంతంగా 8గంటల పాటు షాప్ తెరుచుకోలేని పరిస్థితి! బడుగుజీవుల గురించి ఇక చెప్పేదేముంది? రెక్కడితే కాని డొక్కాడని వారి బ్రతుకుల గురించి ఎంత వర్ణించితేమి? ఎవ్వరూ ఊహించని దెబ్బ.. దానికి తగ్గట్లుగా అవకాశం చూసుకుని బాదేద్దామన్నట్లుగా మోడీ ఆలోచన!
ప్రభుత్వాలకు ఆదాయం తగ్గిపోయిందన్న ఆలోచనే తప్ప… ఈ పరిస్థితుల్లో సామాన్యుడి నడ్డిమీద దెబ్బ కొట్టే పన్నులూ చేయడం ఎంతవరకూ కరెక్ట్ అనే మనసు లేని మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల్ని రోజు వారీగా పెంచుకుంటూ పోతుంది! అంతర్జాతీయంగా పెట్రోల్.. డీజిల్ ధరలు నేల చూపులు చూస్తున్నా కూడా దేశంలో మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నాయి ఈ ధరలు! రూపాయి, రెండు రూపాయలు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతేనే అంత ఇబ్బందా అనుకోవద్దు… ఆ రూపాయి ప్రభావం సామాన్యుడి జీవితం మీద ప్రత్యక్షంగా.. పరోక్షంగా ప్రభావితం చేస్తుందన్న విషయం మరచిపోకూడదు.
ఏదో ఉద్యమం చేస్తున్నట్లుగా వరుసగా రోజు రోజుకీ ధరల్ని పెంచుకుంటూ పోతోంది కేంద్ర ప్రభుత్వం. పదకొండో రోజున కూడా పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం! లీటరు పెట్రోల్ మీద 55 పైసలు పెంచితే.. డీజిల్ మీద 60 పైసలు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గడిచిన పదకొండు రోజుల్లో లీటరు పెట్రోల్ మీద రూ.6.02 పెరిగితే.. డీజిల్ మీద రూ.6.40 పెరిగింది. రానున్న రోజుల్లోనూ పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచటమే తప్పించి తగ్గించే యోచన లేనట్లుగా వ్యవహరిస్తుంది మోడీ ప్రభుత్వం! కరోనా వల్ల కలిగిన నష్టాన్ని సామాన్యుడి నెత్తినే రుద్దాలని యోచిస్తున్నట్లుంది! చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతనలేదేమి సామీ!!