జోషిమఠ్‌లో భూకంపం వచ్చే అవకాశం : NGRI శాస్త్రవేత్త పూర్ణచందర్‌రావు

-

టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపాలు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారులను చూసి ప్రపంచం కన్నీరుపెడుతోంది. అయితే ఆ దేశాల్లో భూకంపాలు సంభవిచడంతో జరిగిన నష్టంపై ఎన్జీఆర్‌ఐలోని భూకంప పరిశోధన కేంద్రం చీఫ్‌ సైంటిస్ట్‌ పూర్ణచందర్‌రావు స్పందించారు. భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు లేకపోవడం, నాసిరకం నిర్మాణాలతో టర్కీలో తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిపారు.

‘‘భూకంప తీవ్రత 7.8గా నమోదవడం, రాత్రివేళలో సంభవించడం వల్ల అక్కడ మృతుల సంఖ్య పెరిగింది. భూకంప కేంద్రం 18 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో తీవ్రత ఎక్కువగా కనిపించింది. 30 కిలోమీటర్ల లోతులో ఉండి ఉంటే తీవ్రత ఇంతలా ఉండేది కాదు. భూకంపం వస్తుందని ముందస్తు హెచ్చరికలు చేసే సాంకేతికత మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఎప్పుడొస్తుంది? ఎన్నిసార్లు వస్తుందనే విషయమై పరిశోధనలు జరుగుతున్నాయి.’

‘జోషిమఠ్‌లో భూకంపం వచ్చే అవకాశముందని అంచనా.  హిమాలయాల చుట్టూ పక్కల ప్రాంతంలో ఎక్కువ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. భూకంపాల తీవ్రతను తట్టుకునేలా ప్రత్యేక నిర్మాణాలపై ప్రభుత్వం ప్రమాణాలను నిర్దేశించింది. కొందరు వీటిని పట్టించుకోవడం లేదు. భూకంపాలను తట్టుకునేలా రెట్రోఫిట్టింగ్‌ ద్వారా పాత భవనాలను మరింత దృఢంగా చేసే అవకాశం ఉంది’’ అని పూర్ణచందర్‌రావు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news