ఒడిశాలో గత కొద్దిరోజుల క్రితం మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ రైలు ప్రమాదం జరిగి నెలరోజులు కావస్తున్నా.. ఇప్పటికీ ఆ దుర్ఘటనలో మృతిచెందిన వారి గుర్తింపు ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు. ఇంకా 76 మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. వాటిని భువనేశ్వర్ ఎయిమ్స్‌లో భద్రపరిచినట్లు వెల్లడించారు.
‘‘బాలేశ్వర్ రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి 81 మృతదేహాలు భువనేశ్వర్ ఎయిమ్స్‌లోని మార్చురీలో భద్రపరిచాం. వాటి నుంచి నమూనాలను సేకరించి డీఎన్‌ఏ పరీక్షలకు పంపించాం. వాటిలో 29 మృతదేహాలను గుర్తించాం. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించాం. ఇంకా 52 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. గుర్తించిన వాటిలో ఐదు మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాం’’ అని అధికారులు తెలిపారు.
మరోవైపు ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో తాజాగా ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అర్చనా జోషి కర్ణాటకలోని యెలహంకలోని రైలు చక్రాల ఫ్యాక్టరీకి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఎలక్ట్రికల్ ఇంజినీర్ ఆఫీసర్ అనిల్ కుమార్ మిశ్రను రైల్వే బోర్డు నియమించింది.