కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఎన్డీఏయేతర ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. పార్లమెంట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడాన్ని నిరసిస్తూ 19 ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 28న కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలనే డిమాండ్‌ను విపక్షాలు లేవనెత్తుతున్నాయి.
‘పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతితో కాకుండా ప్రధాని మోదీ ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. ఈ తీరు రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడం కిందికే వస్తుంది. ఈ అప్రజాస్వామిక చర్యలు ప్రధాని మోదీకి కొత్తేం కాదు. పార్లమెంట్‌లో విపక్ష నేతలు భారత ప్రజల సమస్యలను లేవనెత్తినప్పుడు వారిపై అనర్హత వేటు వేశారు. సస్పెండ్ చేశారు. వారి మాటలను మ్యూట్ చేశారు. పార్లమెంట్ నుంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కనపెట్టినప్పుడు.. ఇక కొత్త భవనంలో మాకు ఏ విలువా కనిపించడం లేదు’ అని విపక్ష పార్టీలు తమ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ క్రమంలో విపక్షాల నిర్ణయంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేయకూడని అన్నారు.