ప్రపంచ వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడారు పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే. తమకు భారత్ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అగ్రదేశాలు అధికారం కోసం ఆడుతున్న ఆటలో తాము బాధితులమయ్యామని ఇవాళ జరిగిన ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడవ సదస్సులో వాపోయారు.
గ్లోబల్ సౌత్‌కు భారత్ నాయకత్వం వహిస్తోందని జేమ్స్ మరాపే ఉద్ఘాటించారు. అంతర్జాతీయ వేదికలపై దాని వెన్నంటే ఉంటామని తెలిపారు. భారత్‌తో కలిసి నడవడానికి ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. అంతకుమందు పపువా న్యూ గినియాకు చేరుకున్న ప్రధానికి అపూర్వ స్వాగతం లభించింది. పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే.. మోదీకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వారిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కాగా పపువా న్యూ గినియాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ సదస్సులో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. అభివృద్ధి చెందిన దేశాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను నమ్మకం ఉంచిన దేశాలు అవసరమైన సమయంలో అండగా ఉండలేదని వ్యాఖ్యానించారు.