సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే వారధులు వాలంటీర్లేనని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు తెలిపారు. చిలకలూరిపేట మున్సిపాలిటీ, చిలకలూరిపేట రూరల్ మండలాలకు చెందిన వాలంటీర్ల కోసం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహిచారు. మంత్రి విడదల రజిని గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతున్నదని చెప్పారు. గుమ్మం వద్దకే ప్రభుత్వ పథకాలు వెళుతున్నాయని చెప్పారు.
ప్రతి నెలా తొలి రోజే వేకువజామునే పింఛన్లు పంపిణీ చేసే విషయంలో వాలంటీర్ల కృషి గొప్పదని చెప్పారు. జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నదన్నారు. ఏకంగా 2.5లక్షలకు పైగా వాలంటీర్లు, 1.5 లక్షల వరకు సచివాలయ ఉద్యోగులు మొత్తం 4 లక్షల మంది ఈ వ్యవస్థ కోసం పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రజలకు నిరంతరం ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ధ్యేయంగా సచివాలయ వ్యవస్థ పనిచేస్తున్నదని చెప్పారు.
జగనన్న తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణల్లో ఇదొక గొప్ప వ్యవస్థ అని వెల్లడించారు. చిలకలూరిపేట పట్టణం, రూరల్ మండలాల్లో కలిపి మొత్తం 543 మంది వాలంటీర్లు ఉంటే.. వీరిలో ఏకంగా 468 మందికి ప్రభుత్వం సేవా మిత్ర అవార్డు ఇచ్చి సత్కరిస్తున్నదని తెలిపారు. మరో ఇద్దరికి సేవా రత్న అవార్డులు ప్రదానం చేస్తున్నామన్నారు. ప్రజలకు వీరు అందిస్తున్న మెరుగైన సేవలకు గుర్తింపుగా.. సేవా మిత్రలకు రూ.10వేలు ఆర్థిక సాయం, సేవా రత్నలకు రూ.20వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు లాలుపురం రాము గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.