పార్లమెంట్ రెండోవిడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ జగధీప్ ధన్‌ఖడ్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక బిల్లు ఆమోదమే తమ ప్రాధాన్యత అని కేంద్రం పేర్కొనగా.. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని సీబీఐ, ఈడీ దాడులు, అదానీ గ్రూపుపై ఆరోపణలు వంటి అంశాలను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
మరోవైపు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ రెండోవిడత బడ్జెట్ సమావేశాల్లో వివిధ అంశాలపై అధికారపక్షాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, హిండెన్‌బర్గ్ నివేదికతో పాటు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు మల్లిఖార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమై.. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలు, చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని నిలదీయనున్నాయి. దీంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ లాంటి పథకాలకు నిధులు నిలిపివేయడంపై ప్రశ్నించే అవకాశం ఉంది.