65% రిజర్వేషన్లు రద్దు.. పట్నా హైకోర్టు సంచలన తీర్పు

-

రిజర్వేషన్ల పెంపు వ్యవహారంలో బిహార్‌లోని నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. దళితులు, గిరిజనులు, వెనకబడిన తరగతులకు విద్యా, ఉద్యోగాల్లో 50 శాతం ఉన్న రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనం తాజాగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

గతేడాది నవంబర్‌లో రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ బిహార్‌ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్థికంగా వెనకబడిన వారిని ఉద్దేశించిన 10శాతం రిజర్వేషన్లు కలిపితే మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరాయి. ఈ పెంపుతో ఎస్సీలకు 16 నుంచి 20 శాతం, ఎస్టీలకు ఒక శాతం నుంచి రెండు శాతం, ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30శాతం ఉన్న రిజర్వేషన్‌ 43 శాతానికి పెరిగింది. ఈ పెంపుపై కొన్నివర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై పట్నా హైకోర్టు మార్చిలో విచారణ జరిపి ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఈ క్రమంలో ఇవాళ రిజర్వేషన్ల పెంపును కొట్టివేస్తూ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్ల చట్టాన్ని సవరించటం రాజ్యాంగ ఉల్లంఘన అని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news