బిహార్లో వరుసగా వంతెనలు కూలిపోతున్న ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. నిర్మాణంలో ఉన్నవి.. వినియోగంలో ఉన్నవి.. పాతవి అనే తేడా లేకుండా వంతెనలు కుప్పకూలుతూనే ఉన్నాయి. బుధవారం రోజున ఇక్కడ ఏకంగా మూడు బ్రిడ్జిలు నేలమట్టమయ్యాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరిగలేదు.
రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో సంభవించిన వరదల కారణంగా సారణ్, సివాన్ జిల్లాల్లో 30 నుంచి 80 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ వంతెనలు కూలిపోయాయని అధికారులు తెలిపారు. వాటి పునాదులు లోతుగా లేకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించారు. తాజా ఘటనతో 15 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తం తొమ్మిది వంతెనలు ధ్వంసమయ్యాయి.
ఈ క్రమంలో వంతెనలు కుప్పకూలడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఉన్న, నిర్మాణంలో ఉన్న అన్ని వంతెనల పరిస్థితిపై. ఉన్నతస్థాయి ఆడిట్ నిర్వహించేలా బిహార్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది బ్రిజేష్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. బలహీనంగా ఉన్నట్లు తేలిన వంతెనలను సాధ్యాసాధ్యాలను బట్టి ధ్వంసం చేయడం లేదా పునరుద్దరించడం చేసేలా ఆదేశించాలని కోరారు.ప్రభుత్వ నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అవినీతి వంతెనలు కూలేందుకు కారణమని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు.