అభివృద్ధి బ్లూప్రింట్‌గా సంస్కరణలు తీసుకొస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ‘నేషన్ ఫస్ట్.. రాష్ట్ర్ హిత్ సుప్రీం’ సంకల్పంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలను అమలు చేశామని చెప్పారు. భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైందన్న ప్రధాని.. జల్ జీవన్ మిషన్ ద్వారా 15 కోట్లమందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. భారత్ చిరుధాన్యాలు ప్రపంచంలోని అందరికీ చేరాలని పేర్కొన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాని ప్రసంగించారు.
‘భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నాం. ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించాం. యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తాం. భారత్ త్వరలోనే ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది. స్వయం సహాయక రంగాలకు ఇప్పటివరకు 9 లక్షల కోట్లు రుణాలిచ్చాం. కోటిమంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తాం.’ అని ప్రధాని మోదీ తెలిపారు.