కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా గురువారం అర్ధరాత్రి బంగాల్ వ్యాప్తంగా వేలాది మహిళలు ఆందోళనకు దిగారు. ‘రీ క్లెయిమ్ ది నైట్’ పేరుతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని నినాదాలు చేశారు. మరోవైపు కొందరు దుండగులు ట్రైనీ డాక్టర్పై హత్యాచారం జరిగిన ఆస్పత్రిలోకి చొరబడి అక్కడ విధ్వంసం సృష్టించారు.
బంగాల్లోని దుర్గాపూర్లో ‘రీ క్లెయిమ్ ది నైట్’ పేరుతో మహిళలు అర్ధరాత్రి సెల్ఫోన్ లైట్లు వేసి నిరసన ర్యాలీ చేశారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని డిమాండ్ చేశారు. వైద్యురాలిపై హత్యాచారం చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలు ధర్నా నిర్వహిస్తున్న సమయంలో కొందరు దుండగులు ముసుగులో ఆస్పత్రి ప్రాంగణంలోకి చొరబడిన అక్కడి సామగ్రి ధ్వంసం చేశారు. సుమారు 40 మంది లోపలికి చొరబడి భద్రతగా ఉన్న పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కొందరు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. దాడులకు పాల్పడిన వారు ఏ పార్టీవారైనా సరే 24 గంటల్లోగా కఠిన చర్యలు తీసుకుంటామని కోల్కతా సీపీ తెలిపారు.