విపక్ష కూటమిలో కొందరు అణు నిరాయుధీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. అలాంటి వారు దేశాన్ని రక్షించలేరని ఫైర్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని పిపారియాలో ఏర్పాటు చేసిన సభలో విపక్ష కూటమి (INDIA) చేస్తున్న ప్రకటనలపై ధ్వజమెత్తారు.రాహుల్ గాంధీ మాటలను దేశ ప్రజలు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు.
విపక్షాల కూటమిలోని కొన్ని భాగస్వామ్య పార్టీలు ప్రమాదకరమైన హామీలు గుప్పించాయని మోదీ అన్నారు. అందులో ఒకటి అణు నిరాయుధీకరణ చేస్తామని చెప్పడం అని తెలిపారు. శత్రుదేశాలు ఎంతో అణ్వాయుధ శక్తి కలిగిన నేటి ప్రపంచంలో అవి లేకుండా ఎలా? మన దేశాన్ని రక్షించుకోవాలంటే అణ్వాయుధాలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వద్దని చెప్పేవారు దేశాన్ని ఎలా రక్షిస్తారు? అని ప్రశ్నించారు.
‘ఒకే దెబ్బతో పేదరికాన్ని తొలగిస్తానని కొందరు అంటున్నారు. అటువంటి ప్రకటనలతో ప్రజలు నవ్వుకుంటారని, ఏదేమైనా రాహుల్ మాటలను దేశ ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదు. గరీబీ హఠావో పేరుతో అప్పట్లో (ఇందిరా గాంధీ) ఇచ్చిన హామీ గురించి ప్రజలకు తెలుసు.’ అంటూ కాంగ్రెస్‌పై మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.