దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే రోజూ 3 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రజలు ఓ వైపు కోవిడ్‌తో చనిపోతుంటే మోదీ పట్టించుకోవడం లేదని, దేశంలో లాక్ డౌన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మోదీ మాత్రం ఎప్పటికప్పుడు దేశంలో కోవిడ్ పరిస్థితులపై సీఎంలు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితి, వైద్య సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ నెల 18, 20వ తేదీల్లో కోవిడ్ అత్యంత తీవ్రంగా ఉన్న 100 జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గడ్ తదితర రాష్ట్రాల్లోని 100 జిల్లాల కలెక్టర్లతో మోదీ ఈ నెల 18, 20 తేదీల్లో వర్చువల్‌గా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొననున్నారు. 18వ తేదీన 46 మంది, 20వ తేదీన 54 మంది కలెక్టర్లతో ఆయన సమావేశం అవుతారు. చివరిసారిగా మోదీ ఏప్రిల్ 23వ తేదీన సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ సమావేశాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. ఆ తరువాత మోదీ ఆగ్రహించడంతో కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. అప్పటి నుంచి మోదీ సీఎంలతో విడి విడిగా సమావేశం అవుతున్నారు. ఇక త్వరలో మళ్లీ గతంలో మాదిరిగానే సమావేశం కానున్నారు.
అయితే దేశంలో కోవిడ్ వల్ల ప్రజలు విలవిలలాడిపోతుంటే మోదీ కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ యాక్టివ్‌గా ఉంటోంది. మోదీ, అమిత్ షాలే టార్గెట్‌గా కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్ టాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. మొన్న అమిత్‌షా కనిపించడం లేదని, నిన్న మోదీ కనిపించడం లేదని హ్యాష్ టాగ్‌లను ట్రెండ్ చేశారు. అయినప్పటికీ దానిపై కేంద్రం స్పందించలేదు.