ఉత్తర్ప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట ఘటన తర్వాత భోలే బాబా పరారైన సంగతి తెలిసిందే. ఆయణ్ను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మెయిన్పురిలో బాబాకు చెందిన ఆశ్రమంలో సోదాలు నిర్వహించారు. కానీ ఆయన అక్కడ కనిపించలేదు. మరోవైపు ఈ దుర్ఘటనపై భోలే బాబా స్పందిస్తూ దర్యాప్తునకు సహకరిస్తానని ఓ ప్రకటన విడుదల చేశాడు.
‘మెయిన్పురిలో భోలే బాబాకు చెందిన నరామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్ట్లో బుధవారం సోదాలు చేశాం. అక్కడే ఆయన కోసం పోలీసుల బలగాలను మోహరించాం. ఆశ్రమంలో 40-50 మంది బాబా అనుచరులు ఉన్నారు. అతడి కోసం వెతికినా ఎక్కడ కనిపించలేదు. ఇప్పటి వరకు బాబా ఆచూకీ గురించి తెలియదు.’ అని డీఎస్పీ సునీల్ కుమార్ తెలిపారు.
మరోవైపు తొక్కిసలాట గురించి స్పందిస్తూ.. వేదిక నుంచి తాను వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఈ ఘటన జరిగిందని భోలే బాబా తెలిపాడు. ప్రభుత్వం చేపట్టే దర్యాప్తునకు పూర్తిగా సహాకరిస్తానని పేర్కొన్నాడు. ఈ దుర్ఘటన వెనక అసాంఘిక శక్తుల కుట్ర ఉందని ఆరోపిస్తూ బాబా తరఫు న్యాయవాది ఓ ప్రకటన విడుదల చేశారు.