అసోంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. భారీ ఎత్తున పోటెత్తుతున్న వరదల వల్ల బుధవారం రోజున మరో 8 మంది మృతి చెందారు. 27జిల్లాల పరిధిలోని 16.25 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. సోనిత్‌పుర్ జిల్లా తేజ్‌పుర్‌లో ఇద్దరు, మోరిగావ్, దిబ్రుగఢ్, దరాంగ్, గోలాఘాట్, బిస్వనాథ్, తిన్‌సుకియా ప్రాంతాల్లో ఒక్కొక్కరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
24 జిల్లాల పరిధిలోని 515 వరద సహాయక శిబిరాల్లో దాదాపు 4 లక్షల మంది తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం 2,800 గ్రామాలు వరదగుప్పిట్లో చిక్కుకుకున్నాయి. 42,478 హెక్టార్లలో వివిధరకాల పంటలు నీట మునిగాయి. వరదల కారణంగా పలు జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అసోంలో సంభవించిన ప్రకృతి విపత్తుల్లో చనిపోయినవారి సంఖ్య 56కు చేరినట్లు అధికారులు తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పర్యటించి ఖానా నదిపై నిర్మించిన ధారాపుర్ జంగ్రాబార్ డ్యామ్‌లో దెబ్బతిన్న స్లూయూస్ గేట్‌ను పరిశీలించారు. చైనా, భూటాన్ నుంచి కూడా వరద వస్తోందన్న హిమంత.. కామ్రూప్ జిల్లాలో వరద పరిస్థితిపై సమీక్షించి ఎన్డీఆర్‌ఆఫ్ బృందాలు 24 గంటలు సహాయ చర్యలు చేపడుతున్నాయనని వెల్లడించారు.