మరో రెండు నెలల్లో తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని మైసూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి జి.టి దేవెగౌడ వెల్లడించారు. 2018 ఎన్నికల్లో ప్రస్తుత ప్రతిపక్షనేత సిద్ధరామయ్య పై జెడిఎస్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. అనంతరం రాజకీయ పరిణామాలతో జెడిఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం జెడిఎస్ ను వీడుతారనే ప్రచారం కూడా ఏడాది కాలంగా సాగుతోంది.
ఇదే విషయమై ఆయన సోమవారం మైసూరులో మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని అన్నారు. వారి అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే మద్దతు ఇస్తానని అన్నారు. ఆత్మసాక్షి కి ద్రోహం చేయదలచుకోలేదు అన్నారు దేవెగౌడ. మాజీ ప్రధాని దేవెగౌడ పట్ల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజన్న వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన బహిరంగంగా క్షమాపణ చెబితేనే సముచితం అన్నారు. కన్నడిగుల మనసును బాధ కలిగించే ఇలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే మంచిదన్నారు.