18వ లోక్సభ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు. ముందుగా పార్లమెంటుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, ప్రధాని మోదీ స్వాగతం పలికారు. అనంతరం పార్లమెంటుకు చేరుకున్న ఆమె ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము కొత్తగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి సభకు ఎన్నికయ్యారని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ వంటివి ఉంటాయి. ఈ సభ వాయిదా తర్వాత వర్షాకాల సమావేశాల నిమిత్తం జులై 22వ తేదీన పార్లమెంటు మళ్లీ సమావేశమైనప్పుడు కేంద్ర బడ్జెట్ సమర్పించే అవకాశం ఉంది. ఈనెల 24వ తేదీన 18వ లోక్సభ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రొటెం స్పీకర్ను ఎన్నుకున్న తర్వాత ఆయన రెండ్రోజుల పాటు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 26వ తేదీన లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాను ఎన్నుకున్న విషయం తెలిసిందే.